అంబేద్కర్ మనందరికీ స్ఫూర్తి ..ఆయన త్యాగం మర్చిపోవద్దు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

  • దళితులను వీక్ చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నరు
  • యూనిటీగా ఉంటేనే హక్కులు సాధ్యమని వెల్లడి
  • ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వ్యక్తి అంబేద్కర్: మాజీ మంత్రి గీతారెడ్డి

ముషీరాబాద్, వెలుగు: ప్రపంచ స్థాయిలో అత్యధిక పట్టాలు పొంది.. మన దేశానికి రాజ్యాంగం అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. అంబేద్కర్ మనందరికి స్ఫూర్తి అని.. ఆయన త్యాగం మర్చిపోవద్దని సూచించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దుర్గం సుబ్బారావు రాసిన ‘పిక్టోరియల్ బయోగ్రఫీ అంబేద్కర్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి గీతారెడ్డి, అరుణోదయ విమలక్క, సుధారాణి, పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ, మహేశ్ బాబు, పల్లె నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. పేద వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని.. కానీ, రిజర్వేషన్స్, దళిత నాయకుల కోసమే అంబేద్కర్​ను పరిమితం చేయడం బాధాకరమన్నారు. ప్రపంచంలో ఎవరికీ లేనన్ని అత్యధిక విగ్రహాలు అంబేద్కర్ కు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఆయన జయంతి, వర్ధంతిని జరుపుకొంటున్నారని గుర్తు చేశారు.

ఇప్పటివరకు తాను 125 విగ్రహాలు డొనేట్ చేశానని చెప్పారు. సొంత లాభాల కోసం కొందరు వర్గీకరణ కావాలని మాట్లాడుతున్నారని, యూనిటీగా ఉంటేనే మనం అన్ని హక్కులు సాధించుకోవచ్చని సూచించారు. కుల వివక్ష సమయంలో అంబేద్కర్ అనేక కష్టాలు పడ్డారని.. ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నామంటే దానికి అంబేద్కర్ కారణమని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. కుల వివక్ష లేని సమాజాన్ని స్థాపించడం లక్ష్యంగా పనిచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరుకు రామచందర్, గోపోజ్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.